హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జంపింగ్‌లో భయంతో హైదరాబాద్ మహానగర
పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో సరికొత్త వ్యూహాన్ని అనుసరించబోతున్నారు. ఎన్నికలు
ముగిసిన తర్వాత తమ పార్టీ తరఫున పోటీ చేసిన గెలిచిన కార్పోరేటర్లు అధికార తెలంగాణ రాష్ట్ర
సమితి (టిఆర్ఎస్)లోకి దూకే ప్రమాదం ఉందని ఆయన పసిగట్టారని అంటారు. ఆ ప్రమాదం కారణంగా
జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపికి ఎక్కువ స్థానాలు ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు జంపింగ్‌ల భయం కారణంగా హైదరాబాదులో బిజెపి లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాదులోని 150 డివిజన్లలో 80 స్థానాలను మిత్రపక్షం బిజెపికి కేటాయించాలని ఆయన భావిస్తున్నట్లు
ప్రచారం సాగుతోంది. బిజెపి నుంచి టిఆర్ఎస్‌లోకి వలస వెళ్లే ప్రక్రియ జరగదని, అందువల్లనే
బిజెపికి ఎక్కువ స్థానాలు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలపై
టిడిపి, బిజెపి సమావేశంలో బిజెపికి ఎక్కువ సీట్లు కేటాయించనున్నట్లు చంద్రబాబు చెప్పారని
అంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇతర పార్టీలకు చెందిన కార్పోరేటర్లను తమ వైపు
లాక్కునేందుకు టిఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందని, అందువల్ల బిజెపికి ఎక్కువ సీట్లు ఇస్తే
ఆ టిఆర్ఎస్ ప్రలోభాలను కట్టడి చేయవచ్చునని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. టిడిపి
కన్నా బిజెపి ఎక్కువ సీట్లకు పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. తమ కూటమి
60కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని కూడా బిజెపి ధీమాతో ఉంది.
బిజెపి పాతబస్తీలో ఎక్కువ
సీట్లకు, కొత్త నగరంలో తక్కువ సీట్లకు పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సీమాంధ్ర
ప్రజలు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేర్‌లింగంపల్లి, వనస్థలిపురం,
మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లోని డివిజన్లలో టిడిపి ఎక్కువ సంఖ్యలో పోటీ చేసే అవకాశాలున్నాయి.
మొత్తం మీద, బిజెపిని సంతోషపెట్టడమే కాకుండా ఆత్మరక్షణ చేసుకునే వ్యూహాన్ని చంద్రబాబు
జిహెచ్ఎంసి ఎన్నికల్లో అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది.