అమెరికా బయలుదేరిన భారత విద్యార్థులను విమానాల నుంచి దించేయడంపై అమెరికా విశ్వవిద్యాలయం ఎయిర్ ఇండియాపై మండిపడుతోంది. విశ్వవిద్యాలయాలు మాత్రం ఎయిర్ ఇండియాదే పొరపాటని ఆరోపిస్తున్నాయి. అమెరికా వస్తున్న భారతీయ విద్యార్థులను అడ్డుకోవడంలో ఎయిర్ ఇండియాదే పొరపాటని అమెరికా వర్శిటీలు నిందిస్తున్నాయి. ఎయిర్ ఇండియా చర్యల వల్ల ఈ ఇబ్బందులు తలెత్తాయని భావిస్తున్నట్టు నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ అధ్యక్షుడు పీటర్ హసెహ్ విద్యార్థులకు ఈ-మెయిల్ పంపించారు. విశ్వవిద్యాలయం ఖ్యాతికి మచ్చ తెచ్చి, పూడ్చలేనంత నష్టాన్ని ఎయిర్ ఇండియా ఎందుకు కలిగించిందో తమకు అర్థం కావడం లేదని అన్నారు. దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది ఎదురైందని వివరించారు. ఎయిర్ ఇండియాపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అమెరికా నుండి విద్యార్థులను తిరిగి పంపిస్తే సంస్థపై ఆర్థిక భారం పడుతుందని భావించి ఎయిర్ ఇండియా విమానాశ్రయాల్లోనే అడ్డుకుందని అన్నారు.
చాలా మంది ఎలాంటి ఇబ్బందులూ లేకుండా
తమ వర్శిటీల్లో చేరుతున్నారని, రెండో దశ పరిశీలనకు వెళ్లినపుడు సరైన పత్రాలు, సమాధానాలు
తెలిపిన వారిని మాత్రమే అమెరికాలో అనుమతిస్తారని వెల్లడించారు. తమ వర్శిటీలో ఎఫ్-1
విద్యార్థులకే గాక, హెచ్-1 వీసాపై వచ్చిన వారు కూడా రావచ్చని చెప్పారు. దీనిపై అనవసర
రాద్ధాంతం చేయవద్దని అన్నారు. అడ్డుకున్న విద్యార్థులు విషయాన్ని పెద్దది చేసి తప్పుడు
ప్రచారం చేస్తున్నారని అది సరికాదని, ఇంటర్వ్యూల్లో పేలవమైన ప్రదర్శన కనబరచడం వల్లనే
వారు వెనుదిరగాల్సి వచ్చిందని, ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకూ చెప్పకుండా వర్శిటీపై
ఆరోపణలు సరికాదని అన్నారు. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలో విఫలమైన కొద్ది మంది విద్యార్థులను
మాత్రమే భారత్‌కు తిప్పిపంపించడం జరిగిందని చెప్పారు. అయితే వర్శిటీ ఆరోపణలపై ఎయిర్
ఇండియా మాత్రం స్పందించలేదు. కాగా, అమెరికా నుండి విద్యార్థులను వెనక్కి పంపించిన ఘటనలో
అమెరికా యూనివర్శిటీలు, భారత ప్రభుత్వం పరస్పరం ఆరోపణలకు దిగుతున్నాయి. యూనివర్శిటీలకే
గుర్తింపు లేదని భారత విదేశాంగ శాఖ చెబుతుండగా, విద్యార్థుల్లో సత్తా లేదని అమెరికా
ఇమిగ్రేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎయిర్ ఇండియా చర్యల వల్లనే విద్యార్థుల్లో గందరగోళం
చెలరేగిందని వెల్లడించాయి.